ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Treatment for OCD : చేసిన పనులే పదే పదే.. చాదస్తమని వదిలేస్తే ఎలా..?

Obsessive Compulsive Disorder: బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి తాళం వేశామా.. లేదా? గ్యాస్‌ సిలిండర్‌, లైట్లు ఆపేశామా.. లేదా?.. ఇలా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసే అలవాటు చాలామందిలో ఉంటుంది. తోటివాళ్లు చాదస్తం అంటున్నా మానుకోలేరు. ఈ లక్షణం కొంతవరకు పర్వాలేదు. కానీ కొందరిలో ఇది శ్రుతి మించిపోతుంది. విపరీత ఆలోచనలు పదే పదే వెంటాడుతుంటాయి. తన ప్రమేయం లేకుండానే మనసులోకి చొచ్చుకొస్తుంటాయి. ఈ మానసిక రుగ్మతనే ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)’ అంటారని వివరించారు.. ఆశా హాస్పిటల్‌ డైరెక్టర్‌, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ మండాది గౌరీదేవి. మరి దీనివల్ల నష్టాలేంటి.. ఇదెలా నివారించవచ్చో తెలుసుకుందామా..?

Treatment for OCD
Treatment for OCD

By

Published : Nov 21, 2022, 4:30 PM IST

Obsessive Compulsive Disorder: సాధారణ ప్రజల్లో సుమారు 2 శాతం మంది ఓసీడీతో బాధపడుతుంటారు. లింగ, వర్గ, వయో భేదాలకు అతీతంగా ఎవరికైనా ఇది వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా 30 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. ‘ఓసీడీ అనేది సహజమేనని, దీనివల్ల పద్ధతిగా నడుచుకుంటారనేవి అపోహలు మాత్రమేనని డాక్టర్‌ గౌరీదేవి తెలిపారు. అందువల్ల ఎక్కువమంది దీన్ని రుగ్మతగా భావించడంలేదని, వాస్తవాలు తెలుసుకొని చికిత్స పొందితే మెరుగైన ఫలితాలుంటాయని ఆమె ‘ఈనాడు’కు వివరించారు.

ఓసీడీ లక్షణాలు మచ్చుకు కొన్ని..

  • ఒక వ్యక్తి(30)కి.. తోటి స్నేహితుడి తలను బండరాయితో పగలగొట్టాలనే భావనలు వస్తాయి. తాను పైనుంచి కిందకు దూకేయాలనుకుంటాడు. ఈ ఆలోచనలు అతడికి తీవ్ర ఆందోళన కలిగిస్తుంటాయి.
  • ఒక మహిళ (45)కు.. తన భర్త నిద్రించేటప్పుడు ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేస్తానేమోననే ఆలోచనలు తరచూ వస్తున్నాయి. తన బిడ్డ గొంతు నులిమి చంపేస్తానేమోనని కూడా. ఇలాంటి వారు కాగితాలను ఉండలాగా నలిపి కింద పడేస్తుంటారు.
  • మరో వ్యక్తి (50)కి.. తన చేతులకు మలిన పదార్థమేదో అంటుకుందనే భావన.. మరో వ్యక్తి (35) దూరం నుంచి జబ్బు మనిషిని చూసినా సరే తనకు ఆ వ్యక్తి ద్వారా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందేమోననే భయపడుతుంటాడు. ఇంకొకరు (60) పనిమనిషి గిన్నెలు కడిగి వెళ్లినా ఇంకా అపరిశుభ్రత ఉందని అపోహ పడుతుంటారు. ఇలాంటివారు తరచూ చేతులు, కాళ్లు, గిన్నెలు, వస్తువులను కడుక్కోవడం, తుడుచుకోవడం చేస్తుంటారు.
  • ఓ మహిళ (40) చేసిన వంటనే మళ్లీ మళ్లీ చేస్తుంటుంది. వంట చేస్తుండగా ఏదో పురుగు పడిందనో.. బల్లి పడిందనో ఆందోళన చెందడమే కారణం.
  • ఒకామె(50)కు తన దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా రోడ్డు మీద పరుగెడుతున్నట్లు ఆలోచనలు వస్తుంటాయి. ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు వస్త్రాలు విప్పేసి వెళ్తానేమోననే భయాలు వెన్నాడుతుంటాయి. మరికొందరికి తాము బూతులు మాట్లాడినట్లు.. తిట్టినట్లు భావన కలుగుతుంది. నేనే అలా మాట్లాడానా? నిజం చెప్పండి.. అని పక్కవారిని పదేపదే అడుగుతుంటారు.
  • కొందరికి తరచూ కొన్ని దృశ్యాలు ఊహల్లోకి వస్తాయి. ఉదాహరణకు వారి అమ్మానాన్నలు లేదా ఇష్టమైన వారు ప్రమాదంలో చనిపోయినట్లు, వారికి పాడె కడుతున్నట్లు, ఏడుస్తున్నట్లు భావిస్తుంటారు.
  • కొందరికి దేవుడిని తిట్టినట్లు, విగ్రహంపై మూత్రం పోసినట్లు, పటాన్ని తొక్కినట్లు ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకిలా వస్తున్నాయని వారు చెంపలు వేసుకుంటారు.
  • కొందరు విద్యార్థులు పరీక్షల్లో రాసిన సమాధానాన్ని కొట్టేసి, మళ్లీ మళ్లీ రాస్తూ సమయం వృథా చేసుకుంటారు.

ఈ ఆలోచనలు, ఊహలు, దృశ్యాలు నిజమైనవి కావు. వారు వద్దనుకున్నా వస్తుంటాయి. భయాందోళనలు కలిగిస్తాయి. దీన్ని పోగొట్టుకోవడానికి ఏదో ఒక పని పదే పదే చేస్తుంటారు. వారికి విపరీత ఆలోచనలు వచ్చినా.. వాస్తవంలో ఎవరికీ హాని తలపెట్టరు.

అపోహలు.. వాస్తవాలు:

అపోహ:అందరికీ కొంత ఓసీడీ ఉంటుంది.
వాస్తవం:విపరీత ఆలోచనలు, చేసిన పనుల్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం వంటి లక్షణాలు కొంతవరకు ఉంటాయి. కానీ అది రుగ్మతగా ఉండదు. కనుక ఇది సహజమేననే భావనతో ఉంటూ చికిత్సకు దూరం కావద్దు.

అపోహ:ఓసీడీ బాధితులు చాలా శుభ్రత పాటిస్తారు.
వాస్తవం:కొందరు మాత్రమే శుభ్రత రుగ్మతతో బాధపడుతుంటారు. మిగిలిన బాధితులు కేవలం తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుని.. పరిసరాలను అపరిశుభ్రంగా వదిలేస్తారు.

అపోహ:ఓసీడీ ఉన్నవారు పద్ధతిగా నడుచుకుంటారు.
వాస్తవం:కొందరు మాత్రమే పద్ధతిగా ప్రవర్తిస్తారు. మిగిలినవారు ఇష్టారీతిగా వ్యవహరిస్తుంటారు.

అపోహ:ఓసీడీ ఉండడం మంచిదే.
వాస్తవం:ఈ రుగ్మత వల్ల శుభ్రంగా, క్రమపద్ధతిలో ఉంటామనే భావన సరికాదు. ఈ సమస్య మితిమీరి పోయినప్పుడు నష్టాలు జరుగుతాయి. సమయం వృథా అవుతుంది. ఇతర పనులపై ఏకాగ్రత కోల్పోతారు. కోపం, అసహనం పెరిగి ఎదుటివారితో వాగ్వివాదాలు జరుగుతాయి.

అపోహ: ఓసీడీ వ్యక్తిత్వం మంచి గుణమే.
వాస్తవం: ఇది వ్యక్తిత్వాన్ని సూచించే మంచి గుణం కానే కాదు. కచ్చితంగా రుగ్మతే. పరిశుభ్రంగా ఉండడం, వస్తువులను జాగ్రత్త పెట్టుకోవడం మంచి అలవాట్లే. అవి శ్రుతి మించినప్పుడే సమస్య. చాలామంది దీన్ని రుగ్మతగా గుర్తించరు. అలా గుర్తించడానికి ఇష్టపడరు.

అపోహ:ఒత్తిడి వల్ల ఓసీడీ వస్తుంది.
వాస్తవం:ఒత్తిడి వల్ల రాదు.. కానీ దాని వల్ల రుగ్మత బయటపడే అవకాశాలున్నాయి. ఇది మానసిక సమస్య. కుటుంబపరంగా, జన్యుపరంగా సంక్రమిస్తుంది. మెదడులో న్యూరోట్రాన్స్‌మీటర్ల లోపాలే దీనికి కారణం.

అపోహ:ఓసీడీకి చికిత్స లేదు.
వాస్తవం:మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మందులు, సైకోథెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీల ద్వారా దాదాపు 60-70 శాతం మందిలో లక్షణాలు నియంత్రణలో ఉంటాయి. చికిత్స దీర్ఘకాలం ఉంటుంది. తగ్గుముఖం పడుతుంది. 30 శాతం మందిలో మళ్లీ మళ్లీ రావొచ్చు. వ్యక్తిని బట్టి చికిత్సల్లో తేడాలుంటాయి. వయసు, కుటుంబ నేపథ్యం, జీవితానుభవాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఆలోచన దృక్పథాన్ని వాస్తవిక కోణంలో చూపించడం ద్వారా వారిలో మార్పు సాధ్యమవుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details