Transfers issue in health department: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఐదేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్న వైద్యులందరికీ స్థానచలనం కలిగించాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వైద్య కళాశాల పరిధిలో 278 మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారు 153 మంది ఉన్నారు. ఈ జీవోను వెంటనే నిలిపివేయాలని వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇతర శాఖల మాదిరిగా వైద్య, ఆరోగ్యశాఖలో ఒకేసారి బదిలీలు చేయడం కుదరదని... దీనివల్ల వైద్యసేవలపై ప్రభావం పడుతుందని సీనియర్ వైద్యులు తెలిపారు.
విద్యార్థులపై ప్రభావం..
కర్నూలు సర్వజన వైద్యశాలలో మెడిసిన్, సర్జరీ, గైనిక్ విభాగాల్లో 80శాతం మంది ఐదేళ్లు పైబడిన వారు ఉన్నారు. బోధనాసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 90 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు 23 మంది, ప్రొఫెసర్లు 40 మంది ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. వీరందరినీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఇంతమందిని బదిలీ చేస్తే రోగులకు అందే సేవలపై ప్రభావం పడనుంది. మరోవైపు వైద్య విద్యార్థులకు వారి అకాడమిక్ సంవత్సరంపై ప్రభావం చూపిస్తుందంటున్నారు. సాధారణంగా వైద్య, ఆరోగ్యశాఖలోని ఇతర కేడర్ ఉద్యోగులకు జోనల్ స్థాయిలో, వైద్యులకు రాష్ట్రస్థాయిలో బదిలీలు ఉంటాయి. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడని వైద్యులు బదిలీ అయిన చోట చేరినా దీర్ఘకాలిక సెలవులు పెడుతుంటారు.
ఓపీలను బహిష్కరించిన అనంతపురం వైద్యులు...