Child Dies Due to Dog Bite : తెలియని పసితనమే ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. ముద్దు ముద్దు పలుకులు పలికే ఆ చిన్నారి తనను కుక్క కరిచిందనే విషయం తల్లిదండ్రులకు చెప్పలేక పోయింది. తల్లిదండ్రులు తెలుసుకునే సరికి చిన్నారి ఆరోగ్య పరిస్థితి చేయిదాటిపోయింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో జహ్నవి అనే మూడు సంవత్సరాల చిన్నారి కుక్క కాటుకు బలైంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపాల్‌కు ప్రమీలతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు మొదటి సంతానం కాగా, కుమార్తె జహ్నవి రెండో సంతానం. మూడు నెలల క్రితం చిన్నారికి శరీరంపై స్వల్పంగా గాయలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు ఆడుకుంటూ గాయపడి ఉంటుందని భావించి.. చికిత్స అందించారు. ఆ సమయంలో చిన్నారి ఆరోగ్యం కుదురుగానే ఉన్నా.. ఇటీవల చిన్నారి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. చిన్నారి వింతగా ప్రవరిస్తుండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు.
పరిస్థితి విషమంగా మారటంతో బెంగళూరులోని మానసిక వైద్యశాలకు తరలించారు. అక్కడికి తరలించి చికిత్స అదించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. తమ కళ్ల ముందే అడుతూ తిరిగిన చిన్నారి.. కానరాని లోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి మృత్యువుతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మే 31 వ తేదీనే చిన్నారి పుట్టిన రోజు అంటూ తల్లిదండ్రులు దుఃఖించినా తీరు స్థానికుల చేత కంటతడి పెట్టించింది.