అనంతపురం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అనంతపురం డివిజన్లోని 19 మండలాల్లో 356 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాప్తాడు రూరల్ పంచాయతీ జాకీర్ హుస్సేన్ కాలనీలోని 14, 15, 16 పోలింగ్ కేంద్రాల్లో 6:35గంటలకు పోలింగ్ ప్రారంభించారు. అనంతపురం రూరల్ కక్కలపల్లి కాలనీ రుద్రంపేట పరిధిలో ప్రజలు ఉదయం నుంచే ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఓటర్లను పోలింగ్ బూత్ లోపలికి అనుమతిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
తాడిపత్రి
నియోజకవర్గ వ్యాప్తంగా మూడోవిడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజవర్గంలో నాలుగు మండలాల్లోని 85 పంచాయతీల్లో ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వాహన రాకపోకలను నిలిపివేస్తున్నారు.
ఉరవకొండ
మండలంలోని జూనియర్ కళాశాలలో 21 పోలింగ్ బూత్లు ఉండగా ఓటర్ల కోసం ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఉరవకొండ 3వ వార్డులో నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థికి గుర్తు కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలింగ్ వాయిదా వేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పంచాయతీల్లోని ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టి పెట్టినట్లు డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు.