అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మహేంద్ర కల్యాణ మండపం ఎదురుగా నివాసముంటున్న వేముల వెంకటనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఈ నెల 6న వెంకటనారాయణ కుటుంబసభ్యులతో ధర్మవరంలోని తన కూతురి నూతన గృహ ప్రవేశానికి వెళ్లారు. అదునుగా భావించిన దుండగులు తాళం పగలగొట్టకుండా బెడ్రూంలోని కిటికీ గ్రీల్స్ కోసి లోపలికి చొరబడ్డారు.
లోపలి గదుల తలుపులు లాక్ వేసి ఉండటంతో... వాటిని మిషను సహాయంతో నిలువుగా కత్తిరించి బీరువాలు ఉన్న రూంలోకి ప్రవేశించారు. రెండు బీరువాలు పగలగొట్టారు. 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బుధవారం రాత్రి ఊరి నుంచి తిరిగి వచ్చిన బాధితులు దోపిడీ జరిగినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో విచారిస్తున్నారు. గతంలో ఇదే ఇంట్లో పట్టపగలే 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ కావడం గమనార్హం. రెండోసారి దొంగతనం జరగడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.