తుంగభద్ర ఆయకట్టు రైతులకు సరిపడా నీరు! - kurnool
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యామ్‌లో నీటి నిల్వ ఈ ఏడాది ఇప్పటికే రెండో సారి పూర్తి స్థాయికి చేరింది. అంచనాలకు మించి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీలకు అధికంగా నీటిని విడుదల చేసే అవకాశముందని తుంగభద్ర జలాశయం బోర్డు ఎస్ఈ వెంకటరమణ తెలిపారు.
ఈసారి నైరుతి రుతుపవనాలు అనంతపురం జిల్లాలో ముఖం చాటేసినా తుంగభద్ర జలాశయానికి మాత్రం భారీ వరదను ఇచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు తుంగభద్ర జలాశయానికి రెండు సార్లు గరిష్ఠ స్థాయిలో నీరు చేరింది. సీజన్‌కు ముందు తుంగభద్ర బోర్డు అధికారులు రాష్ట్ర అధికారులతో నిర్వహించిన సమావేశంలో 163 టీఎంసీల నీరు జలాశయానికి వస్తుందని ముందస్తు అంచనా వేశారు. అయితే ఈసారి జలాశయం ఎగువ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో కురుసిన భారీ వర్షాలతో 272 టీఎంసీల నీరు వచ్చింది. అంచనాలకు మించి టీబీ డ్యాంలో నీటి లభ్యత ఉన్న కారణంగా... అనంతపురం, కర్నూలు జిల్లాల అవసరాల మేరకు నీరు వచ్చే అవకాశం ఉందని జలాశయం బోర్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) వెంకటరమణ చెబుతున్నారు. జలాశయానికి నీటి చేరిక, హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కాలువలకు నీటి విడుదల, జలాశయంలో నీటి నిల్వలు వంటి వివరాలను ఈటీవీ భారత్ ముఖాముఖిలో పంచుకున్నారు.