అనంతపురం జిల్లాకు తుంగభద్ర డ్యాం ఎగువ కాలవ ఎంతో కీలకమైనది. దాదాపు 72 ఏళ్లుగా తాగు, సాగుకు నీరందిస్తోంది. తుంగభద్ర ప్రధాన కాలువ అనంతపురం జిల్లాలో 84 కిలోమీటర్లు, కర్ణాటకలో 105 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. గతంలో ఈ కాలువ సామర్థ్యం 2,800 క్యూసెక్కులు ఉండగా..ఆధునికీకరణతో 4వేల 200క్యూసెక్కులకు పెరిగింది. కర్ణాటక భూభాగంలో ప్రవహించే కాలువ.. తుంగభద్ర డ్యాం బోర్డు ఆధీనంలో ఉండటంతో వారే ఆధునీకరించారు. కర్ణాటక సరిహద్దు తర్వాత కాలువ మాత్రం శిథిలావస్థకు చేరింది. ఎంతో ఉపయోగకరమైన హెచ్ఎల్సీ కాలువ ఆధునికీకరణ..ప్రభుత్వానికి పట్టడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలువ ఆధునికీకరణకు 12 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 467 కోట్ల రూపాయలు కేటాయించింది. పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించి 310 కోట్ల రూపాయలు గుత్తేదారులకు చెల్లించారు. పనుల నిర్వహణ కష్టమని..దానికి ముగింపు చేస్తూ 2018లో గుత్తేదారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుత్తేదారులకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు కాలువ ఆధునీకరణకు గండిపడేలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా తుంగభద్ర డ్యాంలో నీరు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.