గుప్త నిధుల కోసం ముగ్గురిని కిరాతకంగా హత్య చేసిన కేసులో... 8 మంది నిందితులను కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జులై 14న తనకల్లు మండలం కొర్తికోట శివాలయం ఆవరణలో... నిద్రిస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 4 నెలలుగా దర్యాప్తు కొనసాగింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని... అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా గుప్త నిధుల కోసం హతమార్చారా... వేరే ఏదైనా కారణాలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేసినట్లు తెలిసింది. తాజాగా దర్యాప్తు బృందం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వీరిని గాండ్లపెంట స్టేషన్లో ఉంచి... కదిరి గ్రామీణ సీఐ, తనకల్లు, గాండ్లపెంట ఎస్సైలు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు వీరిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.