అనంతపురం జిల్లా వజ్రకరూరు, ఉరవకొండ గ్రామాల వద్ద ప్రయాణికులు వేచి ఉండటానికి ఓ చిన్న గదిని నిర్మించాలన్నా.. ఓ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నా.. వాటికి అవసరమైన స్థలం కోసం దాతల చుట్టూ తిరిగే కాలం ఇది. కానీ, సమాజంలో పూర్తి చైతన్యం లేని కాలంలోనే ఓ వ్యక్తి.. ఊరి ఏర్పాటుకు తన సొంత భూమిని దానంగా ఇచ్చేశారు. ఆయన ఆశయం ఊరికేపోలేదు. ఆ ఊరు నేడు ఎంతోమందిని విద్యావంతులనుగా తీర్చిదిద్దడంతోపాటు ప్రగతి పథంలో పయనిస్తోంది. ఆ వ్యక్తే వజ్రకరూరు మండలం వీపీపీ తండాకు చెందిన రూపానాయక్.
వజ్రకరూరు మండలం వీపీపీ తండాకు చెందిన రూపానాయక్ స్వాతంత్య్రానికి పూర్వం 1933లో సర్వే నెంబరు 70లో 11.21 ఎకరాల భూమిని తండా నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ఈయన విద్యావంతుడు కావడంతో భవిష్యత్తు అభివృద్ధిని గుర్తెరిగి తన భూమిని దానంగా ఇవ్వడం వల్ల నేడు ఆ తండా అభివృద్ధి పథాన నడుస్తోంది. ఆ తండా నిర్మాణంలో కూడా ఆయన పాత్ర విశాలమైందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. ఆంగ్లేయుల పాలనలో బళ్లారి జిల్లా గుత్తి తాలుకాలో ఎక్కువ ఆస్తి పన్ను కట్టే వ్యక్తుల జాబితాలో ఈయన మూడోవ్యక్తిగా ఉన్నారు. అయినా తన ఆస్తిని లెక్క చేయకుండా వారి గ్రామ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడిన చరిత్ర ఆయనది. వారు సన్మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో గురునానక్ భక్తుడిగా ధర్మబోధన పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, సామాజిక కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. నేటి ప్రజలు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు.
స్వాతంత్య్రానికి పూర్వమే...
ఆ తండా నిర్మాణానికి స్వాతంత్య్రానికి పూర్వమే స్థలాన్ని ఇచ్చిన దాత రూపానాయక్ పేరుతో తండా పేరును మార్చాలని గ్రామస్థులు 2014లో అప్పటి కలెక్టరు ఆరోఖ్యరాజ్‌కు వినతి ఇచ్చారు. ఆయన సారథ్యంలో అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి ఆయన స్థలాన్ని దానం చేసిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం 2018 మార్చి 22న రూపానాయక్ తండాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థల దాతకు ఓ గుర్తింపు లభించడంతో పాటు, భవిష్యత్తు తరాలవారు ఆయన నడిచిన ధర్మబోధన, సామాజిక సేవల్లో తరించడానికి అవకాశం ఏర్పడింది.
ఇంటింటా విద్యావంతులు
రూపానాయక్ తండా వెంకటాంపల్లి గ్రామ పంచాయతీలో ఉండేది. 2005లో అప్పటి ప్రభుత్వం దీనిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్పు చేసింది. ఇక్కడ 1253 కుటుంబాలు ఉండగా, 3500 మంది జనాభా ఉన్నారు. 1812 మంది ఓటర్లు ఉన్నారు. వర్షాధార వ్యవసాయమే ఇక్కడ ప్రధానమైంది. కాలక్రమంలో ఆర్డీటీ సంస్థ అందించిన సహకారాన్ని అందిపుచ్చుకుని సొంత గృహాలు నిర్మించుకోవడంతో పాటు ప్రతి ఇంట తమ పిల్లలను విద్యావంతులుగా మార్చుకున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే 98 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు.
మంచి ఆలోచనలతో ముందుకు
స్థల దాత పేరుతోనే ప్రభుత్వం మా తండా పేరును మార్చడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ధర్మబోధన, సామాజిక సేవలతో ఏర్పడిన మా తండా కాలానుగుణంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రగతికి దోహదం చేసేవారికి ఎన్నికల్లో అవకాశం ఇస్తాం. - సుబ్రహ్మణ్యం నాయక్
ఇదీ చదవండి: