దారుణం: జింకను చంపిన వేటగాళ్లు - dead
ముగ్గురు వ్యక్తులు కలిసి జింకను వేటాడి చంపేశారు. చివరికి వారిలో ఒకరు పోలీసులకు చిక్కగా ఇద్దరు పరారయ్యారు.
జింకను వేటాడి చంపిన ఘటనలో ఒకరిని అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన గోపి అనే వ్యక్తి తన మిత్రులు శివ, వీరన్నలతో కలిసి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం విడపనకల్ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. ద్విచక్రవాహనంపై విడపనకల్ పరిసర పొలాల్లో తిరుగుతూ జింకల గుంపు కనబడగానే మాటు వేశారు. తమ వెంట తెచ్చుకున్న తుపాకితో కాల్చగా మందలోని ఓ జింకకు తూటా తగిలింది. ముగ్గురూ కలిసి జింకను ముక్కలు చేస్తుండగా పోలీసులు వచ్చారు. వారిని చూసి వీరన్న, శివ తుపాకితో సహా పారిపోగా గోపి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి జింక చర్మం, మాంసం, కత్తి, ఆకురాయిలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.