వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి మెరుగైన విద్యనందించడంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాత్ర అమోఘమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. ఎస్కేయూ 19వ స్నాతకోత్సవంలో గవర్నర్ వర్చువల్ విధానంలో హాజరై మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా.. సంక్షోభానికి తగ్గట్టుగా అన్ని విద్యాసంస్థలు మార్పు చెందాల్సిన ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో నూతన ఆవిష్కరణలు పెద్ద ఎత్తున అవసరమవుతాయన్నారు. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్‌రెడ్డికి ఎస్కేయూ తరపున గౌరవ డాక్టరేట్ అందించారు.
ఆవిష్కరణలు కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదని సతీష్‌రెడ్డి అన్నారు. యువత తాము ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. మనందరికి ఇది పరీక్ష సమయమని, దీటుగా సవాళ్లను ఎదుర్కొవాలని విద్యార్థులకు సూచించారు.