అనంతపురం జిల్లా కదిరి ప్రాంత ప్రజలు ప్రధానంగా బెంగళూరులో ఉపాధి పొందుతున్నారు. 60 శాతం మంది ఇళ్లకు చేరుకోగా 30 నుంచి 40 శాతం మంది అక్కడే ఉన్నారు. ఎలక్ట్రానిక్ సిటీ, దొడ్డతోగూరు, చిన్నతోగూరు, దొడ్లమంగళ, బసపుర, ఓఫారం, వడ్రపాళ్య, ప్రగతి నగర్, సికారి పాళ్యంలో ఇప్పటికీ సుమారు నాలుగైదు వేల మంది జీవనం గడవక బిక్కుబిక్కుమంటున్నారు. పనుల్లేక, కూలీ సొమ్ము చేతికందని దీనావస్థ. బయటకొస్తే బడితె పూజ... ఇంట్లో ఉంటే ఆకలి బాధతో అలమటిస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పూట గడిచేలా భృతి కల్పించాలనీ, లేదంటే సొంతూరు పంపాలని వేడుకుంటున్నారు.
తిండి దొరకని దైన్యం
కర్ణాటక ప్రభుత్వం పాలు, నిత్యావసరాలు ఇస్తున్నా తమ దరి చేరడం లేదని వాపోతున్నారు. మీలాంటి వారితోనే మాకీ ముప్ఫు.. మీ ఊళ్లకు వెళ్లండనే చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. సొంతూళ్ల నుంచి తెచ్చుకున్న నిత్యావసరాల సర్దుబాటుతో సుమారు 20 రోజులు గడిపేశాం. ఇకపై ఆకలి తీరిదే కష్టమేనని బావురుమంటున్నారు. అద్దె చెల్లించక పోతే ఇళ్లలో ఉండనివ్వరనే భయాందోళనా మొదలైంది. లాక్‌డౌన్ మరింత పొడిగిస్తారని వింటేనే భయమేస్తోందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క నీళ్లడబ్బా రూ.80
ఒక వాటర్ వ్యాన్ రూ.80 అమ్ముతున్నారు. పాలు, ఇతర సరకులు ఉచితంగా ఇస్తున్నా ఆంధ్రవాళ్లకు ఇవ్వమంటున్నారని వలస కూలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి వచ్చేద్దామని బాగేపల్లి చెక్‌పోస్టు వరకు వచ్చినా ముందుకు పోనివ్వక పోవటంతో బెంగళూరుకే వచ్చేశామని ఓ బాలప్పగారిపల్లి చెందిన వలసకూలీ వాపోయారు.