వారంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. రోజూ కష్టం చేసుకుంటూనే... ఆ ఆదాయంలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు 'ఆ నలుగురు' సేవా సమితి సభ్యులు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో 13 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సంస్థ... ఇప్పటికే 60 మందికిపైగా అనాథలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటింది.
ఆదరణ కరవై రోడ్లపై అభాగ్యులుగా మరణిస్తున్న వారిని చూసి చలించిపోయి... ఇలాంటి సంస్థ స్థాపించాలనే ఆలోచన వచ్చిందని.... 'ఆ నలుగురు' సేవా సమితి సభ్యులు చెబుతున్నారు. చివరి యాత్రలో ఎవరూ అనాథలుగా వెళ్లరాదనే భావనతోనే ఈ పవిత్ర కార్యానికి సంకల్పించినట్లు తెలిపారు. గుంతకల్లులోని అనురాగ వృద్ధాశ్రమంలో ఇటీవల మరణించిన వృద్ధురాలికి, పాతబస్టాండ్‌లో మృతిచెందిన ఓ అనాథ వృద్ధుడికి... అన్నీ తామై హిందూ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపినట్లు చెప్పారు.