Kalyandurgam TDP leaders arrest: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈరోజు ఉదయం నుంచి టీడీపీ నేతలపై పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ భూ దందాలకు పాల్పడుతున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడతామని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నాలుగు రోజుల క్రితం ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు మారుతి చౌదరి పట్టణంలోని టీ కూడలి వద్దకు వెళ్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మారుతి చౌదరి భార్య వరలక్ష్మి టీ కూడలి వద్ద బైఠాయించి.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీ కూడలికి చేరుకున్న పోలీసులు.. వరలక్ష్మిని, హనుమంతరాయ చౌదరి భార్య లక్ష్మీదేవిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.
కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ఉష శ్రీ చరణ్ అవినీతి అక్రమాలపై ఆధారాలు బయటపెడతానని.. శుక్రవారం పట్టణంలోని టీ కూడలి వద్ద పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆధారాలను బయటపెడతామన్నారు. హనుమంతరాయ చౌదరి ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు.. టీడీపీ శ్రేణులకు అర్థరాత్రి నుంచే 41 ఏ నోటీసులను అందించారు. అనంతరం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ఈరోజు ఉదయం నడకకు వెళ్లిన హనుమంతరాయ చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ.. మంత్రి ప్రభుత్వ నిబంధలను ఉల్లంఘించి పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ప్రభుత్వ నిబంధన ప్రకారం.. 62 ఎకరాలకు మించిన భూమి ఉండకూడదనే నిబంధన సంబంధించి.. అక్రమ భూముల వివరాలను తాము బహిరంగంగా బయటపెడతామని వెల్లడిస్తామంటే.. పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు రాకపోగా.. ఆధారాలతో సహా బయటపెడతామని పిలుపునివ్వడంతో మంత్రి పారిపోయారని పేర్కొన్నారు.