ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లెలకు విస్తరించిన టెలి మెడిసిన్‌ చికిత్స విధానం - అనంతపురం తాజా

ప్రస్తుతం నగరాల్లో నడుస్తున్న టెలి’ మెడిసిన్‌ చికిత్స విధానం గ్రామాల్లో కూడా విస్తరించడంతో అనంతపురం పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త చికిత్స విధానం ద్వారా.. వైద్యులు వీడియోకాల్లోనే సలహాలు, సూచనలను అందిస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి గ్రామాల్లో ‘టెలి వైద్యం’ అందుబాటులోకి వచ్చింది. వీటిని దశల వారీగా మొత్తం 586 కేంద్రాలకు విస్తరించారు. రోజూ నిర్దేశిత సమయంలో చికిత్సలు పొందవచ్చు. ఈ విధానం జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తోంది.

Tele Medicine policy Elaborate Villeges in anantapur district
పల్లెలకు విస్తరించిన టెలి’ మెడిసిన్‌ చికిత్స విధానం..

By

Published : Dec 28, 2020, 2:23 PM IST

ప్రస్తుతం సరికొత్త చికిత్స విధానం ‘టెలి’ మెడిసిన్‌. పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ ప్రక్రియ నిర్వహణ సహజం. సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల సలహా.. సూచనలతో వీడియోకాల్‌ (వీసీ) ద్వారా చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం పల్లెలకూ విస్తరించింది. నగరాల్లో ఉన్న ప్రత్యేక వైద్యులతో నేరుగా మాట్లాడి చికిత్స అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్‌సీ) ‘టెలి మెడిసిన్‌’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తరహా చికిత్స జిల్లాలోని ఎంపిక చేసిన పట్టణాల్లో ఉన్న 19 యూహెచ్‌సీల్లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, ఆర్థోపెడిక్‌ విభాగాల్లో వారానికి రెండు రోజులు టెలిమెడిసిన్‌ సేవలు అందుతూ వచ్చాయి. ప్రస్తుతం పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించాయి. రోజూ నిర్దేశిత సమయంలో ఈ చికిత్సలు పొందవచ్చు. ఈ విధానం జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తోంది.

దశల వారీగా 586 కేంద్రాలకు విస్తరణ..

ఆయుష్మాన్‌ పథకం కింద జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఉప కేంద్రాలను ‘ఆరోగ్య సంరక్షణ-వికాస్‌ కేంద్రాలు’గా మార్చారు. భిన్నమైన రంగులు వేశారు. చిన్న చిన్న మరమ్మతులు చేశారు. గత ఏడాది మార్చి నుంచి గ్రామాల్లో ‘టెలి వైద్యం’ అందుబాటులోకి వచ్చింది. తొలుత 88 పీహెచ్‌సీల్లో ప్రవేశపెట్టారు. రెండో దశగా 96 ఉప కేంద్రాల్లో ప్రారంభించారు. దశల వారీగా మొత్తం 586 కేంద్రాలకు విస్తరించారు. పీహెచ్‌సీల్లో వైద్యులు, ఉప కేంద్రాల్లో.. మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పేరుతో ఎమ్మెస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత కలిగినవారిని నియమించారు. ఆ కేంద్రాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు.

స్టాఫ్‌నర్సు మాటల్లో..

ఏడు రకాల వ్యాధి నిర్ధరణ పరీక్షలు..

నిర్దేశిత కేంద్రాల్లో ఓపీతో పాటు ఏడు రకాల వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. రక్తశాతం (హెచ్‌బీ), గర్భిణులకు మూత్ర పరీక్ష, మధుమేహం, మలేరియా, ఆర్‌బీఎస్‌... వంటి ప్రాథమిక పరీక్షలు అక్కడే రాపిడ్‌ కిట్ల ద్వారా చేస్తున్నారు. ఎన్‌సీడీ పథకం కింద అదనంగా స్క్రీనింగ్‌ పరీక్షలు కూడా చేయనున్నారు. రక్తపోటు, మధుమేహం, రొమ్ము, గర్భం, నోటి క్యాన్సర్లు.. వంటి పరీక్షలను చేస్తున్నారు. 30 ఏళ్లు పైబడినవారికి ఈ స్క్రీనింగ్‌ చేస్తున్నారు.

64 రకాల మందులు..

టెలిమెడిసిన్‌లో ప్రధానంగా జనరల్‌ మెడిసిన్‌, స్త్రీవ్యాధులు, చిన్నపిల్లలకు సంబంధించిన ప్రత్యేక వైద్య చికిత్స లభిస్తోంది. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ నుంచి ఈ సేవలు అందుతున్నాయి. కేంద్రాల నుంచి వీడియోకాల్‌ చేయగానే వైద్యులు తగిన సలహా, సూచనలు ఇస్తారు. ఏ ఏ మందులు వాడలో వారే సూచిస్తారు. ఇందుకు 64 రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి కేంద్రానికి పుష్కలంగా సరఫరా అయ్యాయి.

ప్రతి కేంద్రంలోనూ 20 నుంచి 100 దాకా ఓపీలు..

ఈ ఆరోగ్య-వికాస్‌ కేంద్రాలు ప్రభుత్వ పనివేళల్లో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పనిచేస్తున్నాయి. బయటి రోగులను (ఓపీ) కూడా చూస్తున్నారు. ప్రత్యేక ల్యాబోరేటరీ ఉంది. ఎంఎల్‌హెచ్‌పీలే ఓపీ చూసి.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు కూడా చేస్తున్నారు. ప్రతి కేంద్రంలోనూ 20 నుంచి 100 దాకా ఓపీ సేవలు లభిస్తున్నాయి.

'చాలా సంతోషంగా ఉంది'

తల తిరగడం.. రక్తపోటు సమస్యతో ఆస్పత్రికి వెళ్లా. అక్కడి నర్సు బాగా చూశారు. కొన్ని అనుమానాలు ఉంటే పెద్ద డాక్టర్‌కు ఫోన్‌ చేసి మందులు ఇచ్చారు. వారంలో ఒక్కసారైనా ఆస్పత్రికి వెళ్తా. మందులు మంచివే ఇస్తున్నారు. సొంతూరిలో ఇంత బాగా చూస్తుండటం చాలా సంతోషంగా ఉంది.

- నరసమ్మ, వడియంపేట, బీకే సముద్రం

'మంచిగా చూశారు'

కాన్పు తర్వాత క్రమంగా ఆస్పత్రిలోనే చూపించుకుంటున్నా. గర్భసంచికి సంబంధించిన నొప్పి వచ్చింది. నర్సు మంచిగా చూశారు. తిరుపతికి ఫోన్‌ చేసి పెద్ద డాక్టర్‌తో మాట్లాడారు. రక్త పరీక్షలు, ఇతర రిపోర్టులన్నీ వారికి పంపించారు. ఇప్పుడు ఏ సమస్య లేదు.

- అంజనమ్మ, రేకులకుంట, బీకేఎస్‌

ఇదీ చదవండి:

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఐదుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details