OMC CASE : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఛార్జ్ షీట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై అభియోగాలకు తగిన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐ పేర్కొన్న ఐపీసీ 120బి రెడ్ విత్ 409తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ సెక్షన్ 13(1)(d) కాకుండా ఇతర చట్ట నిబంధనలు వర్తిస్తాయేమో పరిశీలించాలని సీబీఐ కోర్టుకు సూచించింది. ఒకవేళ ఇతర సెక్షన్లు వర్తిస్తే ఆ అభియోగాలు నమోదు చేసి విచారణ కొనసాగించ వచ్చునని సీబీఐ కోర్టుకు స్వేచ్ఛనిచ్చింది.
అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై 2012లో సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సీబీఐ ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొంది.
పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి నేరపూరిత నమ్మక ద్రోహానికి, కుట్రకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపింది. గనుల లీజుల కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడంతో పాటు.. ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారని సీబీఐ పేర్కొంది. అది అక్రమ మైనింగ్ కు దోహదపడిందని సీబీఐ అభియోగం మోపింది. అయితే... సీబీఐ తనను అనవసరంగా కేసులో ఇరికించిందని.. ఈ అభియోగాలను కొట్టివేయాలని గతంలో సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీలక్ష్మిని ఛార్జ్ షీట్ నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ సీబీఐ కోర్టు గత నెల 17న ఆమె డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసింది.