West Rayalaseema MLC Election Result: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ, వైఎస్సార్పీపీ హోరాహోరీ తలపడ్డాయి. ఈ స్థానంలో 49 మంది అభ్యర్థులు పోటీ పడగా మొత్తం 3లక్షల 30 వేల 124 ఓట్లకుగానూ 2లక్షల 45వేల687 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 19వేల 239 ఉండగా 2 లక్షల 26 వేల 448 ఓట్లు లెక్కించారు. ఒక్కో రౌండ్‌కు 24వేల చొప్పున 11 రౌండ్లలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి వైఎస్సార్పీపీ అభ్యర్థి రవీంద్రరెడ్డికి 95వేల 969 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94వేల 149 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి వైఎస్సార్పీపీ అభ్యర్థి 18వందల 20 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొమ్మిది రౌండ్లలో ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. రెండు రౌండ్లలో టీడీపీకి స్వల్ప ఆధిక్యం దక్కింది. పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు 18వేల 758 ఓట్లు, భాజపా బలపరిచిన రాఘవేంద్రకు 7వేల 412 ఓట్లు వచ్చాయి.
మొదటి ప్రాధాన్యంలో ఎవరికీ కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యం తగ్గుతూ వచ్చింది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను మిగిలిన వారికి పంచుతూ వచ్చారు. మొత్తం 48 రౌండ్లలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయింది. 46వ రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థి కమ్మూరు నాగరాజు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించగా వైకాపా ఆధిక్యం వెయ్యి 66కి తగ్గింది.
47వ రౌండ్‌లో భాజపా అభ్యర్థి రాఘవేంద్రను ఎలిమినేట్ చేశారు. ఆయనకు సంబంధించి 3వేల 312 రెండో ప్రాధాన్య ఓట్లు తెలుగుదేశం అభ్యర్థి రామగోపాల్‌రెడ్డికి పడగా, 12వందల 37 వైకాపా అభ్యర్థి రవీంద్రరెడ్డికి దక్కాయి. అక్కడితో తెలుగుదేశానికి 99వేల 895 ఓట్లు, వైకాపాకు 98వేల 886 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌తో తెలుగుదేశం వెయ్యి 9 ఓట్ల మెజార్టీ సాధించింది.