రైతుల సమస్యలను పరిష్కరించాలని తెదేపా నాయకులు అనంతపురం జిల్లాలో నిరసనలు చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కళ్యాణ దుర్గంలో...
కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. అతివృష్టి, అనావృష్టి వంటి కారణాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
కదిరిలో...
రైతుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరును నిరసిస్తూ కదిరి నియోజక వర్గంలోని తనకల్లు,గాండ్లపెంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం నాయకులు ధర్నా చేపట్టారు. అన్నదాతకు పెట్టుబడి రాయితీ, పంటల బీమా చెల్లింపు విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
హిందూపురంలో...
ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూపురంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.