అనంతపురం జిల్లాలో..
హిందూపురంలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన నేతలు తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో...
కనిగిరి పట్టణంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెదేపా హయంలో నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి తెదేపా నేతలు "నా ఇల్లు నా సొంతం నా ఇల్లు కావాలి" కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన చేస్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లబ్ధిదారులు తమ ఇండ్లనైనా చూసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన జి ప్లస్ 2 ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అప్పగించాలంటూ ఒంగోలులో తెదేపా ఆందోళన చేపట్టింది. నా ఇల్లు నా సొంతం పేరుతో కొప్పోలు, చింతల ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కొ ఇళ్లను వైకాపా ప్రభుత్వం వృథాగా వదిలేస్తుందని, దాదాపు నిర్మాణాలు పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు అప్పగించాలని, లేదంటే తామే స్వాధీన పరుచుకుంటామని వీరు హెచ్చరించారు. తక్షణం లాటరీ పద్ధతి ద్వారా ఇల్లు కేటయించాలని, పెండింగ్లో ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో...
బొబ్బిలిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు కేటాయించాలని తేదేపా నాయకులు నిరసన చేపట్టారు.. నిర్మించిన గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలని వారు డిమాండ్ చేశారు.