రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో తెదేపా చేపట్టిన ఐదు రోజుల నిరసన కార్యక్రమం మంగళవారం రాయలసీమ జిల్లాలతో మొదలైంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లపై ర్యాలీగా వెళ్లి, కూరగాయల్ని, ఇతర పంటల్ని నేలపై పోసి నిరసన తెలిపారు. తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.
కడప లోక్‌సభ స్థానం పరిధిలో..
కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పులివెందుల పడా కార్యాలయంలో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో కేసీ కెనాల్ ఆయకట్టు కింద సమృద్ధిగా నీరున్నా సమస్యలతో రైతులు పంటవిరామం ప్రకటించిన భూముల్ని కడప లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు లింగారెడి,్డ రైతులతో కలసి పరిశీలించారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. బద్వేలు తహసీల్దారు కార్యాలయం వద్ద ఓబులాపురం రాజశేఖర్, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ బాధ్యుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు మండలంలో నిరసనలు జరిగాయి. పులివెందులకు వచ్చిన కలెక్టర్ విజయరామరాజును పార్టీ నాయకుడు రాంగోపాల్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. జమ్మలమడుగు పాత బస్టాండులో తెలుగురైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయం వద్ద టమాటాలను నేలపై పారబోసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి నిరసన తెలియజేశారు. మైదుకూరు పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.