అనంతపురం జిల్లా ..
తూర్పగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలియజేశారు. మెట్టు బండ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన, కార్యకర్తలపైన కేసులు పెట్టి ముఖ్యమంత్రి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలని అనంతపురంలో తెదేపా మహిళా విభాగం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం వద్ద ఉన్న యాచకులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. వైకాపా పాలనలో ప్రజలతో పాటు ఆలయాలకు కూడా రక్షణ కరువైందని అన్నారు.
కృష్ణాజిల్లా..
హిందూత్వంపై వైకాపా దాడులకు నిరసనగా కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పూజలు నిర్వహించారు. 16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అక్రమాలపై విచారణ జరపాలని సౌమ్య డిమాండ్ చేశారు. బిట్రగుంట సంఘటన పై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే అంతర్వేదిలో దారుణం జరిగేది కాదన్నారు. వీటిని ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని.. వీటన్నింటికీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నందిగామ మండలం పల్లగిరి, రాఘవాపురం, పెద్దవరం గ్రామాలలో జరుగుతున్న గ్రావెల్ మైనింగ్ అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నందిగామ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్, తహసీల్దార్‌లకు తంగిరాల సౌమ్య మెమోరాండం అందించారు.
తూర్పు గోదావరి జిల్లా..
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ప్రసన్నాంజనేయుని ఆలయంలో తెదేపా శ్రేణులు పూజలు నిర్వహించారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పాలన చేస్తోందని మాజీ మంత్రి రాజప్ప అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి 16 నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కానీ ప్రభుత్వం వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి.నా ప్రమేయం ఉంటే ఉరి తీయండి: ఆది నారాయణరెడ్డి