Nara lokesh Yuvagalam padayatra : ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, అభిమానులు, టీడీపీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు. పాదయాత్రలో 62వ రోజు 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకూ యువగళం మొత్తం 805.4 కి.మీ. సాగింది. పాదయాత్ర 63వ రోజు శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం మార్తాడు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కానుంది. పాదయాత్ర 800 కి.మీ అధిగమించిన సందర్భంగా మార్తాడులో శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. మార్తాడు కెనాల్ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. అనంతరం బుడేడు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ చేపట్టనున్నారు. గార్లదిన్నెలో భోజన విరామం అనంతరం గార్లదిన్నె డ్యామ్ రోడ్డు సర్కిల్ నుంచి స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. గార్లదిన్నెలో నిర్వహించనున్న బహిరంగసభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. జంబులదిన్నె విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
గురవారం ఇలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 62వ రోజు ముగిసింది. గురువారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి శింగనమల నియోజకవర్గం గార్ల దిన్నెమండలంలోకి ప్రవేశించింది. శింగనమల నియోజకవర్గ ప్రజలు కోటంక వద్ద నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌పై పూల వర్షం కురిపించి, జై జై... నినాదాలతో ఆహ్వానించారు. 62వ రోజు పాదయాత్రలో లోకేశ్ 16 కిలోమీటర్లు నడవటంతో ఇప్పటి వరకు మొత్తం యువగళం పాదయాత్ర ద్వారా 805 కిలోమీటర్లు పూర్తిచేశారు. శుక్రవారం 63వ రోజు శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.