అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తన నివాసంలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే ప్లకార్డు చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదించటం.. ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడానికి సీఎం జగన్ కంకణం కట్టుకుంటే అందుకు గవర్నర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇది చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది అని విమర్శించారు.
'మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు' - ananthapuram district
నాడు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి చారిత్రాత్మక తప్పిదం చేసింది. నేడు వైసీపీ కూడా మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆరోపించారు.
రాష్ట్రంలో 80 శాతానికి పైగా ప్రజలు, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ బిల్లుపై సంతకం పెట్టడం ప్రజా వ్యతిరేకత కాదా అని ప్రశ్నించారు. కరోనా కేసులు, మరణాలు పెద్దఎత్తున పెరుగుతున్న సమయంలో అలజడి రేపడం రాష్ట్రానికి బ్లాక్ డే తప్ప మరేమీ కాదన్నారు.
ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటే చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యక్తిగత కక్షతోనే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యకు పూనుకుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఈ వ్యవహారంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి'అమరావతి రైతులకు జనసేన అండగా ఉంటుంది'