TDP Leaders Protests Against Punganur Incident: పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకునేందుకు.. వైసీపీ శ్రేణుల విఫలయత్న దాడిపై, టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగాయి. రాష్ట్రాభివృద్దిపై చంద్రబాబు చెబుతున్న వాస్తవాలను జీర్ణించుకోలేకే, మంత్రి పెద్దిరెడ్డి ఆదేశంతోనే వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి అవినీతి-అక్రమాలు.. ప్రజలకు తెలియజేస్తామని టీడీపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు సభలను అడ్డుకుంటే, తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. టీడీపీ చేపట్టిన ఈ నిరసనల ర్యాలీలకు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వ్యాహాత్మకంగా అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసనలకు దిగిన టీడీపీ నేతలను కట్టడి చేసేలా వ్యవహరించారు. కొందరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరిని నిరసనలకు దిగకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటనలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి బానిసల్లా మారారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే, వైసీపీ తొత్తులుగా వ్యవహరించిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు పర్యటనలో పుంగనూరు ఘటనను ఖండిస్తూ వైసీపీ అరాచక పాలన నశించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బృందాలుగా ఏర్పడి విడతల వారీగా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. మొదటగా అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు.
తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు డి రమేష్ కుమార్ ఇతర నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో కొంతమంది టీడీపీ శ్రేణులు అంబేడ్కర్ కూడలి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్కు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి పోలీస్ స్టేషన్కు తరలించారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజన్నప్ప ఆధ్వర్యంలో మరి కొంతమంది శ్రేణులు ఎన్టీఆర్ కూడలి వద్దకు చేరుకొని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ర్యాలీని ఎన్టీఆర్ కూడలి నుంచి.. అంబేడ్కర్ కూడలి వరకు కొనసాగించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. టీడీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా వాహనాలలో స్టేషన్కు తరలించారు.
TDP Leaders Fires on Punganur Incident: అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులపై పోలీసులు ఆంక్షలు విధించారు. పుంగనూరులో టీడీపీ శ్రేణులపై రాళ్లదాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లాల్లో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత.. చెన్నెకొత్తపల్లిలో నిరసన తెలపటానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలపటానికి వెళుతున్నామని చెప్పినా పోలీసులు వినకపోవటంతో పరిటాల సునీత జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచక పాలనకు పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన దాడులు నిదర్శనమని అనంతపురంలోని టీడీపీ బీసీ సెల్ నాయకులు అన్నారు. పుంగనూరులో వైసీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉరవకొండలో టీడీపీ శ్రేణులు.. పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి నీకు రోజులు దగ్గర పడ్డాయి అనే పోస్టర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్లాక్ టవర్ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు.
గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. రాళ్లు , కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని, చివరకు ఎస్పీ సైతం వైసీపీకి వత్తాసు పలికారని ఆయన మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి తన ఇష్టానుసారానికి వాడుకుంటున్నారని విమర్శించారు.