తెదేపా నేత సుబ్బయ్య హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. త్వరలో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దోపిడీ రాజ్యానికి ప్రజలు స్వస్తి పలకాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ప్రజలకు తెదేపా అండగా ఉంటుందని చెప్పారు.
గుంటూరు జిల్లా:
హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజవర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారని నియోజకవర్గం తెదేపా సమన్వయకర్త కోవెలమూడి రవీంద్ర అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. పరిపాలన విషయంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఇకనైనా కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
తెదేపా నేత సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. జిల్లాలోని హిమాని సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలను సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసిర్ అహమ్మద్ అన్నారు. సుబ్బయ్యని హత్య చేస్తే పార్టీ నేతలు భయపడరని.. మరింత ధైర్యంగా పోరాడతామన్నారు. హత్యకు కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.