TDP Leaders Protest Against Contaminated Water Supply అసలే ఎండా కాలం గుక్కెడు తాగు నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. అందులోనూ కరువు జిల్లా అనంతలో తాగునీటి కష్టాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నా.. ప్రభుత్వాలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను చూడలేకపోతున్నాయి. ఈ సమస్యలు ప్రతి వేసవికాలం ఎదురవుతున్నా..ప్రభుత్వాలు తీసుకంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. తాగునీటి సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, గుంతకల్లు డివిజన్ లో మున్సిపాల్టీ అధికార్లు సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితంగా ఉంటోందని ప్రజలు.. గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోకపోవడంతో.. స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. స్థానిక టీడీపీ నేతలతో కలసి, అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అధికారులు సరఫరా చేస్తున్న కలుషిత తాగునీటిపై ప్రజలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలుషిత వాటర్ బాటిళ్లతో టీడీపీ నాయకులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. అధికారులు.. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం దారుణం అంటూ నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు పవన్ గౌడ్.. మున్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. మంచినీటిని సరఫరా చేసే ఫిల్టర్ బెడ్లకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారే కానీ, తాగు నీటిని సరఫరా చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారులు వారి ఇళ్లల్లోని టాయిలెట్స్‌లో కూడా ఉపయోగించని నీటిని.. ప్రజలకు తాగునీటిగా సరఫరా చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. ఈ మేరకు కలుషిమైన నీటిని అరికట్టి.. నాణ్యమైన తాగు నీటిని సరఫరా చేసి ప్రజా ఆరోగ్యం కాపాడాలని మున్సిపాలిటీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.