TDP Leaders Protest Against Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేప్టటారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేశారు. "సైకో పోవాలి.. సైకిల్ రావాలి" అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబు సోదరి హైమావతి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.
మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు సత్యమేవ జయతే దీక్షలో పాల్గొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. మహాత్మాగాంధీ బ్రిటిషర్లతో పోరాడినట్లు.. ప్రభుత్వ అరాచకాలపై పోరాడాల్సి వస్తోందని తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేశారు. నల్ల రిబ్బన్లు ధరించిన టీడీపీ శ్రేణులు దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలో ర్యాలీ చేసి దీక్షా శిబిరంలో బైఠాయించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ కొంతమంది కార్యకర్తలు శిరోముండనం చేయించుకున్నారు.
వైసీపీ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద బాబు చేతులకు సంకెళ్లు వేసుకుని రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.