TDP Protest: విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెంచుతూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళనలు చేపట్టింది.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ర్యాలీ నక్కా ఆనందబాబు: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి ప్రజలను వరుసపెట్టి బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. బాపట్ల జిల్లా వేమూరులోని పెదపులివర్రు గ్రామంలో కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ర్యాలీ చేశారు. ప్రభుత్యం రోజురోజుకు విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజలకు పెట్టిన ముద్దులు ఇప్పుడు గుద్దులుగా మారాయన్నారు. పాదయాత్రతో జగన్ అన్ని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.
సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు సారథ్యంలో సైకిల్ యాత్ర కాలవ శ్రీనివాసులు:డీజిల్, పెట్రోల్ ధరలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం సైకిల్ యాత్ర నిర్వహించారు. సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు సారథ్యంలో తెలుగుదేశం నాయకులు 5 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. కూరగాయలు, పాలు, పండ్లు అమ్మే చిరు వ్యాపారులు కూడా సైకిల్ ర్యాలీలో పాల్గొని... ధరల మంటపై నిరసన వ్యక్తం చేశారు. ధరల మోతతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమామహేశ్వర నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం నాయకులు వినూత్న నిరసన ఉమామహేశ్వర నాయుడు: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కళ్యాణదుర్గం తెలుగుదేశం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు... బస్సులో ప్రయాణిస్తూ భజనలు చేశారు. పేద ప్రజలు బస్సుల్లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారంటూ నినాదాలు చేశారు. సామాన్యుల వాహనమైన పల్లెవెలుగు బస్సుల్లో టికెట్ ధరలు రెండింతలు చేయడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: Ayyana: ఉద్యోగం వస్తుందని ఆశించి రావడం.. ముమ్మాటికీ వాళ్ల తప్పే: అయ్యన్నపాత్రుడు