ఎన్టీఆర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని... అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పులమాల వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలిసి నగరంలోని లలిత కళా పరిషత్ లో ఆయన రక్తదానం చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రతి వ్యక్తి సేవా మార్గంలో పయనించాలనే ఆయన స్ఫూర్తితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా సేవలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పార్టీని స్థాపించిన మహనీయుడు అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురం తెదేపా పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి... జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం...
కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్ ముందు తారక రామారావు విగ్రహానికి ... నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆరంభించారు. ఆయన కూడా రక్తదానం చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో యువత, తెలుగుదేశం కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు రక్తాన్ని దానంగా ఇచ్చారు.
ధర్మవరం...
ధర్మవరంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాండురంగ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి... నియోజకవర్గం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాలాభిషేకం చేశారు. తర్వాత పూలమాల వేసి నివాళులర్పించారు. ధర్మవరం తో ఎన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు.
పుట్టపర్తి...
దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది.. ఎన్టీఆర్ అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. జిల్లాలోని పుట్టపర్తిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని , అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహానీయుడు నందమూరి తారక రామారావు చేసిన సేవలను కొనియాడారు.
పెనుకొండలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సవిత , హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి ... ఎన్టీఆర్ విగ్రహం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచి పెట్టారు.