గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న నీటి ఒప్పందాలను అమలుచేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు నిలదీయట్లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెెక్టుల భవిష్యత్తుపై సీమ జిల్లాల తెదేపా నేతలు శనివారం అనంతపురంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలోని 11వ షెడ్యూలు ప్రకారం హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, పార్లమెంటు ఆమోదముద్ర వేసిందన్నారు. అయితే కేంద్రం తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మూడింటికీ ఆమోదం లేదనడం దారుణమన్నారు. ఇది ఎవరి అసమర్థతో అర్థమవుతుందన్నారు.
మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా మిగులు జలాలపై హక్కులు వదులుకుంటామనడం రాయలసీమకు శాపంగా మారిందన్నారు. కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఇష్టారీతిన కృష్ణా జలాలను వాడుతుంటే సీఎం జగన్ అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో హంద్రీనీవాకు రూ.300 కోట్లే ఖర్చు చేశారని.. అది సొంత పత్రికకు ఇచ్చిన ప్రకటనల విలువ కూడా చేయదని ఆరోపించారు. మాజీమంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ హంద్రీనీవాపై వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సీఎం అనాలోచిత వైఖరి వల్లే ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు.
18 అంశాలతో తీర్మానం
సభ అనంతరం కాలవ శ్రీనివాసులు 18 అంశాలతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా, గాలేరు-నగరిలకు అధికారికంగా నీటిని కేటాయించాలి. వీటిని ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. జీవో 69 మేరకే తెలంగాణ విద్యుత్తు అవసరాలకు శ్రీశైలం నీటిని వాడుకునేలా చూడాలి. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. అర్ధాంతరంగా ఆపేసిన జీడిపల్లి-బీటీపీ, జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలి. వేదావతి ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణం ప్రారంభించాలి’ అని తీర్మానించారు.
ఈ సమావేశం సరైంది కాదు- జేసీ ప్రభాకర్‌రెడ్డి
సదస్సులో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు వివాదానికి దారితీశాయి. సమావేశం మధ్యలోంచే ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ‘హంద్రీనీవా, టీఎంసీలు అంటే ఎవరికీ అర్థం కాదు. హంద్రీనీవా గురించి కాదు.. చంద్రబాబును మళ్లీ ఎలా ముఖ్యమంత్రిని చేయాలో మాట్లాడండి. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన లోకేశ్‌నే అరెస్టుచేశారు. జిల్లా నాయకులు రెండు హంద్రీనీవా కాలువలను సందర్శించినా ఏమీ చేయలేదంటే ఏదో లోపాయికారీ ఒప్పందం కుదిరింది. లేదంటే మనందరినీ లోపల వేసేవారే. ఈ సమావేశం సరైంది కాదు. సమావేశం గురించి కార్యకర్తలకు, మాజీలకు చెప్పారా? ఇదంతా కాలవ శ్రీనివాసులు, మరోవ్యక్తి కనుసన్నల్లో జరుగుతోంది. చంద్రబాబు సర్.. కార్యకర్తలను మేము సరిగ్గా చూసుకోవడం లేదు’ అన్నారు.
ఇదీ చదవండి:'జగన్ పాలనలో రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం'