తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయటంతోనే తనపై ఆరోపణలకు దిగుతున్నారని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. తాను జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటున్నట్లు, రిజర్వాయర్ గర్భంలో కలిసిపోయిన భూమిని సాగు చేసుకుంటున్నట్లు ఇటీవల కొన్ని పత్రికల్లో ఆరోపణలు చేశారన్నారు.
అవన్నీ అర్థరహిత ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. ఇంతవరకు తాను ఒక్క చుక్క నీటిని కూడా వాడుకోలేదనీ.. ప్రస్తుతం తాను సాగు చేస్తున్న ప్రతి ఎకరానికీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై కొన్ని పత్రికల చేత అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.