Payyavula Fired on TTD : సామాన్య భక్తులను స్వామి వారిని దూరం చేసేందుకే తితిదే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని తెదేపా నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా దర్శనానికి వచ్చిన భక్తులు మొదటిసారిగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మంగళవారం జరిగిన సంఘటలు ఇంకా పూర్తిగా సరిదిద్దే ప్రయత్నాన్ని అటు పాలకమండలిగానీ.. ఇటు ప్రభుత్వంగానీ.. ఇంకా చేపట్టలేదని అన్నారు.
తితిదే తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో దాదాపు 1500 రూములను మూసివేయడం.. కింద ఉన్న హోటళ్లలో వ్యాపారాల కోసమే అన్నట్లుగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన సేవలో తరించండానికి తమకు అభ్యంతరం లేదని.. అంత వరకు సామాన్య భక్తుల కోసం పని చేయాలని సూచించారు.