ఈఎస్ఐ కుంభకోణంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురంలో ఏసీబీ అధికారులకు తెదేపా శ్రేణులతో కలసి సోమవారం వినతి పత్రం ఇచ్చారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడికి కార్తీక్ అనే వ్యక్తి కోటి రూపాయల విలువైన బెంజ్ కారును జన్మదినం సందర్భంగా ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని కోరారు. మంత్రి పదవి నుంచి జయరాంను వెంటనే తొలగించి బెంజ్ వ్యవహారంలో నిజనిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.
పదహారు నెలల పాలనలో ప్రతి పథకంలోనూ వైకాపా చేతివాటం ప్రదర్శిస్తోందని పార్థసారధి దుయ్యబట్టారు. మద్యం అమ్మకాల్లో సైతం దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి పెద్ద మొత్తంలో దోచుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. రైతులు, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.