ప్రభుత్వానికి టీడీపీ మాజీ మంత్రి పరిటాల సవాల్.. జాకీ పరిశ్రమను వెనక్కి తేవాలని.. TDP EX MINISTER PARITALA SUNITHA FIRES ON YSRCP : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని పలు కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు. ఆటలు, పాటలు, డాన్సులు పలు రకాల కార్యక్రమాలను నిర్వహించి.. బహుమతులను అందజేశారు. మహిళా సాధికారత, వాళ్లు సాధించిన విజయాల గురించి చర్చించారు. పలువురు మహిళలకు సన్మానాలు చేశారు. అనంతపురం జిల్లాలో కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పచ్చని పల్లెల్లో చిచ్చురేపడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తెలుగు మహిళలు నిర్వహించిన మహిళా దినోత్సవ సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభను ఉద్దేశించి తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీక్షణ సమావేశంలో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అనంతరం పరిటాల సునీతను పలువురు మహిళలు సన్మానించారు. అనంతరం ఆమెను గజమాలతో సత్కరించారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడిన పరిటాల సునీత.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు.
" ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చులు రేపడానికి వైఎస్సార్సీపీ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారు. మొన్న విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వందల కంపెనీలు వస్తాయని చెప్పారు.అయ్యా మేము లక్షల కోట్లు అడగడం లేదు. కేవలం 200 కోట్ల రూపాయల విలువ గల జాకీ పరిశ్రమను రాప్తాడు నియోజకవర్గానికి ఇస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉంది.. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే మహిళలకు ఉపాధి లభిస్తుంది. ఇప్పటికైనా మీకు ధైర్యం ఉంటే జాకీ పరిశ్రమను మళ్లీ రాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రిని, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా" -పరిటాల సునీత, టీడీపీ మాజీ మంత్రి
ఫ్యాక్షన్‌కు దూరమైన ప్రజలను రెచ్చగొడుతూ.. పల్లెల్లో చిచ్చురేపడానికి వైఎస్సార్సీపీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. 6000 మంది మహిళలకు జీవనోపాధి కల్పించే జాకీ గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు కాకుండా బెదిరించి వెళ్లగొట్టారని సునీత ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. జాకీ పరిశ్రమ యజమానులను 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయటం వల్లనే మహిళలకు ఉపాధి కల్పించే పరిశ్రమ వెనక్కు వెళ్లిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాకీ పరిశ్రమను తిరిగి రాప్తాడు నియోజకవర్గానికి తీసుకురావాలని పరిటాల సునీత.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి, ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: