తెదేపా కార్యకర్తపై అధికార పార్టీ నాయకులు గొడ్డలితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా నేత పరిటాల శ్రీరామ్ తెలిపారు. అనంతపురం జిల్లా కుర్లపల్లి సమీపంలో వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్త నారాయణస్వామి నాయక్‌ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీరామ్ పరామర్శించారు. కుర్లపల్లి గ్రామ శివారులో కాపుగాచి నారాయణస్వామిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని శ్రీరామ్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా గ్రామాల్లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే దాడి చేశారని.. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కనగానపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి నాయక్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణ స్వామికి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న నారాయణస్వామిని శ్రీరామ్ పరామర్శించారు.