అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలో దొంగ ఓట్లు వేయించుకుని అడ్డదార్లో గెలవడానికి అధికార వైకాపా నాయకులు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పోలింగ్ రోజు కూడా పెనుకొండ పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు. జిల్లాకు ఎటువంటి సంబంధం లేని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలసముద్రం సమీపంలో మకాం వేసి, ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో పెనుకొండకు తరలించడానికి కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. అధికార వైకాపా రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేనందునే ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందన్నారు.
KALVA: అడ్డదారుల్లో గెలిచేందుకు వైకాపా కుట్రలు.. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే.. - వైకాపాపై ప్రజా వ్యతిరేకత
అనంతపురంలో జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా నేతలు అక్రమంగా దొంగ ఓటర్లను వినియోగించి గెలవాలనుకుంటున్నారని తెదేపా నేత కాల్వ అన్నారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నట్లు వెల్లడించారు.
తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఒకవైపు ముఖ్యమంత్రి జగన్, స్థానిక మంత్రులు మూటగట్టుకున్నారని కాల్వ అన్నారు. కాబట్టే దొంగ మార్గంలో గెలవాలని చూస్తున్నారని.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. పెనుకొండ పట్టణానికి బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కట్టడి చేసి, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ELECTION FIGHTS: దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్లు ఉద్రిక్తతలు