TDP Leader Kalva Srinivasulu House Arrest: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఓ వైపు ముఖ్యమంత్రి పర్యటన.. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల నిరసనలతో జిల్లా ఉడుకెత్తిపోతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా పోలీసులు రాయదుర్గంలో భారీ ఆంక్షలు విధించారు. కాగా .. కాల్వ శ్రీనివాసులుకు నోటీసులు జారీ చేయడానికి పోలీసులు వెళ్లగా వాటిని ఆయన నిరాకరించారు. రాయలసీమకు సాగునీరు అందించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రాయదుర్గం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడానికి కాలవ పిలుపునిచ్చారు. దీంతో ర్యాలీ చేయడానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకొని నోటీసులు ఇచ్చారు.
ఈ సందర్భంగా కాల్వ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమను సస్య శ్యామలం చేయడానికి దుర్భిక్ష నివారణ పథకం కింద 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించి, 3000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని కాల్వ దుయ్యబట్టారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించే హంద్రీనీవా, గాలేరు హగరి, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందించే కార్యక్రమం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.