అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అరాచక శక్తిగా మారారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రాయదుర్గం ప్రాంతంలో అవినీతి అక్రమాలు మితిమీరాయని రాయదుర్గంలో ఆరోపించారు. యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారస్తులపై దాడులు చేయిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే అరాచకాలకు రాయదుర్గం అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి పై సీఎం జగన్ చర్యలు తీసుకొని.. సస్పెండ్ చేయాలని కోరారు. గత 20 నెలల్లో కాపు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలని కోరారు.
ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా
రాష్ట్ర ప్రభుత్వం ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను పదే పదే వాయిదా వేస్తోందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందన్నారు. ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా లేదని అధికార పార్టీ మద్దతుదారులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని కుట్రలో భాగంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.