తెదేపా, అనుబంధ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకోవడం ఎమర్జెన్సీని తలపిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతపురంలోని రెండో పట్టణ, గ్రామీణ పోలీసుస్టేషన్లలో ఉంచిన తెదేపా నాయకులను పరామర్శించడానికి ఆదివారం రాత్రి ఆయన వెళ్లారు. ఏం నేరం చేశారని మూడ్రోజుల ముందుగానే పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తారని ప్రశ్నించారు. విడుదల చేసే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదన్నారు. తాడేపల్లికి వెళ్లి అక్కడ నిరసనలు చేస్తే అరెస్టు చేయాలే గాని ముందుగానే అరెస్టు చేయడం తగదన్నారు. పోలీసుల అదుపులో ఉన్న నాయకులను విడుదల చేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అరెస్టులు..
అనంతపురం పార్లమెంట్ నాయకుడు జేసీ పవన్‌రెడ్డి ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి వచ్చారు. పోలీసులు అనంతపురం నగరం సరిహద్దులోనే గుర్తించి అదుపులోకి తీసుకొని ఆయన నివాసం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీనగర్‌లోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లాలని ప్రయత్నించడంతో తెదేపా శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. తోపులాట జరిగింది. కాసేపు ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే బైఠాయించి ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శులు బుగ్గయ్యచౌదరి, జేఎల్.మురళీధర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్రనాయకులు వెంకటప్ప, లక్ష్మీనరసింహ, అనంతపురం పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు గుత్తా ధనుంజయనాయుడు, చల్లా జయకృష్ణ, సాకే వీరాంజనేయులు, చంద్రదండు ప్రకాష్‌నాయుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మురళి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి తదితరులను అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లో ఉంచి అనంతరం విడుదల చేశారు.