ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JC Vs Kethiredy: తాడిపత్రిలో హీటెక్కిన పాలిటిక్స్​.. నువ్వా-నేనా అంటున్న నేతలు.. జేసీ హౌస్​ అరెస్టు - జేసీ గృహనిర్బంధం

TDP Leader JC Prabhakar Reddy House Arrest: తాడిపత్రిలో టెన్షన్​ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు. ఉదయం నుంచే జేసీ ఇంటి చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. కార్యకర్తలను అటువైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. పంటల బీమా పేరుతో.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 14 లక్షలు కాజేశారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

JC Prabhakar House Arrest
JC Prabhakar House Arrest

By

Published : Jul 8, 2023, 12:22 PM IST

TDP Leader JC Prabhakar Reddy House Arrest: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ తాడిపత్రి మున్సిపల్​ ఛైర్మన్, తెలుగుదేశం నేత​ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చీనీ తోటకు పంట బీమా డబ్బులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొట్టాశారని జేసీ ఆరోపించారు. ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వస్తానంటూ జేసీ ప్రభాకర్​ నిన్న సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి చీనీ మొక్కలు నాటిన సంవత్సరానికే రూ.14 లక్షల పరిహారం అందిందని జేసీ ఆరోపణలు గుప్పించారు.

ఇందులో భాగంగా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వెళ్లాలని జేసీ నిర్ణయించారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణంలో భారీగా మోహరించారు. అలాగే తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఉదయం నుంచే జేసీ ఇంటి చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. కార్యకర్తలను కూడా అటువైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. పంటల బీమా పేరుతో.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 14 లక్షలు కాజేశారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. చీని పంటకు అక్రమంగా రికార్డులు నమోదు చేయించి కుటుంబసభ్యుల పేరుతో బీమా తీసుకున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ఆగ్రహం:కాగా నిన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏడాదిన్నర చీనీ తోటకు పంట బీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ ఓ ఫ్లెక్సీని జేసీ ఏర్పాటు చేశారు. పంట బీమా విషయంలో అన్నదాతలకు న్యాయం జరగలేదని.. అధికార పార్టీ నాయకులకే న్యాయం జరిగిందన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 14 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని.. దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు. అసలు చీనీ తోటలో పంట లేకుండానే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశారని జేసీ ఆరోపించారు. సంవత్సరం వయసున్న చీనీ చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో.. వచ్చే సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే చీనీ పంట పరిశీలనకు జేసీని వెళ్లకుండా పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు.

నా తోటకు వస్తే ఈడ్చి కొడతా: ఎమ్మెల్యే కేతిరెడ్డి.. తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏడాదిన్నర చీని పంటకు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట నష్టపోయిందని పంటల బీమాను రూ. 14 లక్షల వరకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కాజేశారని, జేసీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎంత వరకు పంట నష్టపోయిందో చూడటానికి ఇవాళ తాను వెళతానని జేసీ సవాలు విసరగా.. ఉదయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు పహారా ఏర్పాటు చేసి, గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అయితే పంటల బీమా రాకూడదా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. తన తోటకు వస్తే ఈడ్చి కొడతానని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details