Lockup death in Anantapur District: గొర్రెల చోరీ కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం స్టేషన్ లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆంజనేయులు గొర్రెల దొంగతనానికి పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించగా.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆంజనేయులు కంప్యూటర్ రూమ్‌లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తుండగా.. లాకప్ డెత్ జరిగిందని ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు.
రూ.7 లక్షల పరిహారం:మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.7లక్షలు చెల్లించేందుకు పెద్దమనుషుల సమక్షంలో పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ముందుగా రూ. 5 లక్షలు చెల్లించారని, మిగతా మొత్తం పోస్టుమార్టం అయిన వెంటనే చెల్లిస్తామని పోలీసులు తెలిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు సస్పెండ్: మృతుల కుటుంబ సభ్యులను పోలీసులే ప్రత్యేక వాహనాల్లో అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామం నుంచి రాయదుర్గం తరలించారు. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఆంజనేయులు మృతదేహాన్ని చూసిన వెంటనే భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం వారిని మీడియా కంట కనబడకుండా ప్రత్యేక గదిలో ఉంచారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేశారు.