అనంతపురం జిల్లా గుత్తి రైల్వేకాలనీ సమీపంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రామచంద్ర అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే యువకుని మృతిపై అతని చిన్నాన్న అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
మృతుని తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్ర గుత్తి ఆర్ఎస్లోని ఎస్సీ కాలనీలో బేల్దారి పని చేసుకుంటూ నివాసముంటున్నాడు. అయితే గత కొన్ని నెలల క్రితం మద్యం మత్తులో అదే కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులతో గొడవపడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇదే క్రమంలో గురువారం కూలీ పనులు ముగించుకొని మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం పలువురితో గొడవపడి.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఉదయాన్నే పాఠశాలలో ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.