గుంతకల్లు మండలంలోని కదిరిపల్లిలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి.. వివరాలు సేకరించారు.
మరణించిన వ్యక్తిని కదిరిపల్లి గ్రామానికి చెందిన పోతుల కిష్టప్పగా గుర్తించారు. మూడు రోజుల కిందట వ్యక్తి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కిష్టప్ప మెడకు గాయాలు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైన హత్య చేసి ఉంటారా? అన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.