అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చరిత్ర కలిగిన రెండు సూర్యదేవాలయాలు.. ఆధ్యాత్మిక శోభతో ఓలలాడుతున్నాయి. దేశంలోనే సూర్యదేవాలయాలు చాలా అరుదు. కోణార్క్, అరసవెల్లిలో ఈ ఆలయాలు ఉన్నాయి. అలాంటిది ఒకే మండలంలో రెండు సూర్యభగవానుడి ఆలయాలు ఉండటం ప్రత్యేకమనే చెప్పుకోవాలి. జిల్లాలోని బూదగవి, అమిద్యాల గ్రామాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా సూర్యభగవానుడు తూర్పు అభిముఖంగా కొలువుదీరి ఉంటాడు. కానీ అమిద్యాలలో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తే, బూదగవిలో దక్షిణముఖంగా కనిపించడం విశేషం.
బూదగవి గ్రామంలోని సూర్యనారాయణస్వామి ఆలయాన్ని క్రీస్తుశకం 13వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం ప్రపంచంలోనే దక్షిణ ముఖంగా ఉన్న ఏకైక సూర్యదేవాలయంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ సూర్యనారాయణస్వామి ముఖ్య శిష్యుడైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండటం విశేషం. గతంలో పుట్టపర్తి సాయిబాబా ఉరవకొండలో నివసించే సమయంలో నిత్యం సూర్యనారాయణస్వామిని పూజించే వారని తన ఆత్మకథలో రాసుకున్నట్లు చెబుతారు. ఏటా భక్తులు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
అమిద్యాలలోని సూర్యభగవానుడి ఆలయం దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నట్టు ఆలయ పురాణం చెబుతోంది. చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలిచే ఈ దేవాలయంలో.. చెన్నకేశవస్వామి, శివుడు, సూర్యభగవానుడి విగ్రహాలకు ప్రత్యేక గర్భగుడులు ఉన్నాయి. ఆలయంలోకి అడుగుపెట్టగానే మొదటగా చెన్నకేశవ స్వామి దర్శనం కలుగుతుంది. తూర్పు దిక్కుగా ఉన్న శివలింగానికి ఎదురుగా సూర్యభగవానుడు దర్శనమిస్తాడు. సప్తాశ్వరథంపై కొలువుదీరిన స్వామివారి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. దేవాలయం ప్రాంగణంలో శిలాశాసనాలు కూడా కనిపిస్తాయి.