భూతగాదాలు, సివిల్ కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే చేపట్టింది. అనంతపురం జిల్లాలో భూములు రీసర్వేకి 964 గ్రామాలను గుర్తించారు. రీసర్వే బాధ్యతను సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. తొలిదశలో 311 గ్రామాలను ఎంపిక చేసుకుని... సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డిసెంబర్‌లో సర్వే ప్రారంభించారు. డ్రోన్ కెమెరాతో హద్దులు గుర్తిస్తూ సర్వే పనులు కొనసాగిస్తున్నారు. సమగ్ర సర్వేతో గ్రామాల్లో భూవివాదాలకు తెర పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
భూముల రీసర్వేలో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానంతో వ్యవసాయ క్షేత్రాల్లో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి, రైతులకు యూనిక్ కార్డులు ఇస్తారు. ఇప్పటి వరకు 27 గ్రామాల్లో హద్దుల గుర్తింపు పూర్తయింది. ఇక భూముల్లో హద్దులు సరిచూసి, రాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పరిజ్ఞానం వినియోగంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవటంతో... డ్రోన్ విడుదల చేసే భూమి కొలతల ఛాయాచిత్రాలు ప్రధాన సర్వర్‌కు వెళ్లడం లేదు. దీనివల్ల సమీపంలోని పట్టణానికో, నగరానికో వెళ్లి అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాలో కేవలం ఒకే డ్రోన్‌తోనే సర్వే చేస్తుండటం వల్ల... ఆరు నెలలలోపు తొలిదశ 311 గ్రామాల్లో పని పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ సమస్యలను అధిగమించి సర్వే పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.