సత్యసాయి 96వ జయంతిని పురస్కరించుకొని.. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవాన్ని నేడు నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయం ఛాన్సలర్ చక్రవర్తి అధ్యక్షతన జరిగే ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(CJI Justice NV Ramana).. కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు ప్రశాంతి నిలయంలోని సాయి శ్రీనివాస అతిథిగృహం వద్ద కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి రమేష్, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప, సంయుక్త కలెక్టర్ నిశాంత్‌కుమార్ స్వాగతం పలికారు.
జస్టిస్ రమణ రాత్రి శ్రీనివాస అతిథిగృహంలో బస చేశారు. నేడు ఉదయం 9గంటలకు సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం జరిగే స్నాతకోత్సవంలో ప్రసంగించనున్నారు. 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 24 మందికి డాక్టరేట్లు, 465 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అనంతరం విద్యార్థుల వేద పఠనం, ప్రతిజ్ఞ, సత్యసాయి గీతాలాపన, సాయంత్రం 5 గంటలకు సాయికుల్వంత్ మందిరంలో నిత్యశ్రీ మహదేవన్ బృందం సంగీతగాన కచేరి నిర్వహించనున్నారు.