Two Brothers Suicide: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పామిడి మండలంలో కొండాపురం గ్రామంలో అన్న మృతిని జీర్ణించుకోలేక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేనేత కుటుంబానికి చెందిన రంగమ్మ, ఆంజనేయ దంపతులకు రంగనాయకులు, సుధాకర్, రంగస్వామి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబమంతా చేనేత పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పెద్ద కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదు. రెండవ కుమారుడు సుధాకర్ కొన్ని నెలల క్రితం ఇల్లు నిర్మించుకుని అప్పుల బాధను తాళలేక.. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. అన్న మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన తమ్ముడు రంగస్వామి(25) నీటి కుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సుధాకర్ మృతికి ఐదో రోజు చిన్న కర్మకాండ పనులు జరుపుతున్న సమయంలో బందువులు అంతా ఇంటి వద్ద ఉండగా బయటకు వెళ్లిన రంగస్వామి.. సోదరుడి మరణంతో మనోవేదనకు గురై.. గ్రామ శివారులో ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. రంగస్వామి నీటి కుంటలో దూకిన విషయాన్ని అటుగా వెళ్తున్న స్థానిక గొర్రెల కాపరులు గమనించి.. గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం కాపరులు నీటి కుంటలో దూకి బాధితుడిని వెలికి తీయడానికి ప్రయత్మించారు. కానీ అప్పటికే రంగస్వామి మృతి చెందాడని తెలిపారు. కాపరుల ప్రయత్నం నిర్వీర్యం అయ్యింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం.. మరో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.