అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండుకు చెందిన విద్యార్థులంతా.. పాఠశాలకు వెళ్లాలంటే వంతెనపై నడిచి వెళ్లాల్సింది. బడికి వెళ్లేందుకు వీరు ప్రతిరోజూ పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. జాతీయ రహదారి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లచెరువుకు వెళ్లేందుకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ బ్రిడ్జ్‌లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. ఫలితంగా ఈ మార్గం నుంచి నడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
అల్లుగుండు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే. ప్రతిరోజూ ఈ ఊరి నుంచి పాఠశాలకు 150 మంది విద్యార్థులు వెళ్తున్నారు. వీరంతా వేరే మార్గంలేక వంతెన పిట్టగోడలపై నుంచి ట్రాక్ మీదగా ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. విద్యార్థుల బాధలను చూసిన స్థానికులు.. పక్కనే ఉన్న పొలం యజమానికి విజ్ఞప్తి చేసి కాలినడకకు సరిపడే మార్గాన్ని తీసుకున్నారు. ఆ పొలం నుంచి వెళ్లాలన్నా విధిగా రైలు పట్టాలు దాటాల్సిందే. గతంలో ఉన్న లెవల్ క్రాసింగ్ ను తొలగించి అండర్ బ్రిడ్జ్ నిర్మించారు. కానీ.. వర్షపు నీరు చేరి అది ఉపయోగపడడం లేదు. ఏ సమయంలో ఎటు నుంచి రైళ్లు వస్తాయో తెలియక విద్యార్థులు భయం భయంగా పట్టాలను దాటుతున్నారు.