పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం.. అనంతపురం జిల్లాకు వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (ADIMULAPU SURESH) కాన్వాయ్ ను విద్యార్థి యువజన సంఘాల నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను (JOB CALENDER) విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో వెళ్లే సమయంలోనూ ఇదే కొనసాగింది. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైకాపా ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని.. ఆవేదనతో రోడ్లపైకి వచ్చిన తమను అణచి వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టటం తగదని.. విద్యార్థి సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతపురం పర్యటన..
రాష్ట్రంలో ఆన్ లైన్ విద్యాబోధనకు రెండు విశ్వవిద్యాలయాలు ఎంపిక చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపారు. అనంతపురం ఓటీఆర్ఐ ప్రాంగణంలో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఫార్మసీ కళాశాల వసతి గృహాల నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రాజేంద్ర పబ్లిక్ స్కూల్కు వెళ్లి అక్కడ నాడు-నేడు పనులను పరిశీలించారు. విద్యాదీవెన పథకం ద్వారా రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులు ల్యాప్ టాప్ లు కావాలని ఐచ్చికంగా కోరినట్లు ఆయన వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో 2000 ఖాలీలు భర్తీ చేసినట్లు వివరించారు.