కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం బయట ఉన్న చిరు వ్యాపారులు, ఓ హెడ్ కానిస్టేబుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ వస్తువులను పోలీసులు రోడ్డుపై విసిరారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో మున్సిపల్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. ఈ మేరకు చిరు వ్యాపారుల నుంచి నిర్దేశించిన మొత్తాన్ని వసూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే.. ఏటా చెల్లించే సొమ్ము కంటే ఈ సంవత్సరం ఎక్కువ చెల్లిస్తున్నామని దుకాణదారులు తెలిపారు. అయినప్పటికి పోలీసులు నిత్యం తమతో దురుసుగా మాట్లాడటం, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి పడేయడం వంటివి చేస్తున్నారని వాపోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ విషయంపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్, ఎస్సై హామీ ఇచ్చి.. ఆందోళనను విరమించేలా చేశారు.